ఆదిమ తెగ వడ్డెర్ల లో పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ, మన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు, వడ్డె ఓబన్న వారసత్వాన్ని కాపాడుకోలేమా?
(సైరా సినిమా లో ఓబన్న పాత్రను హతమార్చడంతో, వడ్డెర్లలో మరో ఉద్యమ జ్వాల ప్రజ్వరిల్లిన ఈ తరుణంలో, వడ్డె ఓబన్న ఔన్నత్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఓ ఐదు ముక్కల్లో చెప్తాను! దయచేసి చదివి మీ అభిప్రాయాలను తెలుపగలరు)
(1) స్వతంత్ర పోరులో వడ్డె ఓబన్న పాత్రను, ప్రపంచానికి పరిచయం చేసిన డా|| తంగిరాల వెంకట సుబ్బారావు కు మనము సదా ఋణపడి ఉండాలి. ఎందుకంటే, అగ్ర కులాల చరిత్రలు రాయడానికి మరియు దాయడానికి ఉన్న వనరులు, వెనుక బడ్డ కులాలకు లేవు! ఈ నేపథ్యంలో మన వీరుని చరిత్రను రావు గారు శోధించి రాయడం మన అదృష్టం.
(2) అన్ని కులాల వారు గౌరవించే, రజకుల్లోని ఒక ఐలమ్మ, గోండుల్లోని ఒక కొమరం భీం, బోయల్లో ఒక వాల్మీకి మహర్షి, విశ్వ బ్రాహ్మణుల్లో వీరబ్రహ్మం ఉన్నట్లు, వడ్డెర్లలో ఒక సుప్రసిద్ధ నాయకుడ్ని మనము ముందు పెట్టుకోవడంలో విఫలం అయ్యాము. ఆ స్థానంలో ఒక చరిత్రలోని చక్రవర్తినో లేక జమీందారునో ఉంచితే, నేరతెగ మరకతో అన్ని కోల్పోయి SC/ST హక్కు కై పోరు సలుపుతున్న మనకు లాభం కంటే, నష్టం ఎక్కువని నేను నమ్ముతున్నాను. అందుకే, ఏ రాచరికం లేని, వివాదం లేని, అందరినీ కోల్పోయి ఏ వారసత్వం లేని, సామాన్య వడ్డె ఓబన్నను మన కుల ఐకాన్ గా ప్రమోట్ చేసుకోవాలని నా విజ్ఞప్తి
(3) ఆదిమ తెగ వడ్డెర్లు, 200 ఏళ్ల క్రితమే బ్రిటీషు వారిని ఎదిరిస్తే, వడ్డె వీరులను అంతం చేయడానికే, వడ్డెర తెగను కూడా CT యాక్టు ద్వారా NT లిస్టు లో కలిపారు అని చెప్పడానికి ఒక చారిత్రక ఆధారం, మన వడ్డె ఓబన్న. ఈ మహానుభవుణ్ణి మన ఐకాన్ గా పెట్టుకుని ముందుకు వెళితే, మన SC/ST పోరుకు కూడా ఊతం ఇచ్చిన వారము అవుతాము
(4) చరిత్రనుండి తుడిచేయబడ్డ వడ్డె ఓబన్న, పుట్టు పొర్వోత్తరాలే కాదు, ఒక చిత్రం కూడా మనకు లభించలేదు. అయితే, తంగిరాల గారి రీసెర్చ్ ద్వారా, ఓబన్న గారు బలాఢ్యుడు మరియు పిల్లి కళ్ల వాడు అని తెలుస్తోంది. మనం ముందుగా, అలాంటి ఆకృతిని తయారు చేసుకోవాలి. మన ముందు తరం వారు ధరించినట్లు, తలపాగా, ఉత్తరీయం, ధోవతి, తాయెత్తులు మరియు ఆర్భాటం లేని ఆభరణం ఒకటి ఉంటే చాలు.(చరిత్ర పుస్తకాల్లోనుండి వడ్డెర్ల ఫోటో కూడా అటాచ్ చేస్తున్నాను). చేతిలో ఖడ్గం, డాలు లాంటివి తప్పక పెట్టాలి. అలాగే, అతణ్ని ఓ రాజులా ఆభరణాలు, కిరీటాలతో అలంకరించకపోతే మంచిది. ఈ ఆకృతిని మనం ఎంత తొందరగా చేసుకుంటే, మన లెటర్ హెడ్లు, బ్యానర్లకే కాదు, వడ్డే ఓబన్న విగ్రహాలు చేయించడానికి కూడా పనికొస్తుంది. అలాగే, అతని జయంతులు, వర్ధంతులు తెలియవు కాబట్టి, కనీసం NT విమోచన దినం రోజైన, మనం ఓబన్న ను విగ్రహాల వద్ద స్మరించుకోవచ్చు
(5) నా వంతుగా, వడ్డె ఓబన్న తొలి వడ్డె విగ్రహం, కుందు నది వడ్డున ఎక్కడైనా ప్రతిష్టించ డానికి 5 వేల రూపాయలు ఇవ్వగలను. అలాగే, నా ఖర్చులతో బెంగళూరు నుండి, డా౹౹ తంగిరాల గారిని ఈ విగ్రహావిష్కరణకు తీసుకు వస్తాను. ఆకృతి పూర్తయిన వెంటనే, నేను నడుపుతున్న సమితి, వెబ్సైట్ల లో కూడా, వడ్డె ఓబన్న ఫోటోను సింహభాగంలో పెట్టడం జరుగుతుందని ప్రామిస్ చేస్తున్నాను
మీరెందరూ, వడ్డె ఓబన్న ఔన్నత్యాన్ని పెంచడంలో సహకరిస్తారని ఆశిస్తూ,
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి